Monday 3 March 2014

జోలాలి


- అబుల్‌ హసన్‌

జోలాలి యా అల్లాహ్‌ అంటూ అంటూ; నువ్‌
మేల్కోవాలి సల్లీ అలా అంటూ అంటూ

దుష్టుల దౌష్ట్యాలను సహించాలి
ధూర్తుల దురాగతాలను భరించాలి
మమతల మల్లెలు జల్లుకుంటూ ఆగక నువ్‌
సాగిపోవాలి 'యా రహీమ్‌' అంటూ అంటూ
                                ''జోలాలి....''
ముళ్ళ బాటనైనా నడవాలి దాన్ని
పూదోటగా మలచుకోవాలి ప్రతి క్షేత్రంలో
నువ్‌ మకుటం లేని మారాజుగా ఎదగాలి
'యా ఫత్తాహ్‌! యా ముయిజ్జ్‌' అంటూ అంటూ
                                ''జోలాలి....''
సాత్వికత నీ సఖి, శిఖి అవ్వాలి
ప్రజలందరితో నువ్‌ ప్రేమగా మెలగాలి
విధేయతా పూలు నీలో విరబూయాలి
ఖుర్‌ఆన్‌ చేబూని నువ్‌ కదలాలి
'అజిల్‌ ఇలైక రబ్బీ లి తర్ద్వా' అంటూ అంటూ
                                ''జోలాలి....''
కర్రి మబ్బుల్లో వెలుగు ముగ్గులు వేయాలి
దిక్కులన్నీ పిక్కటిల్లేలా సత్య శంఖం ఊదాలి
నువ్‌ మసక చీకట్లను పారద్రోలాలి
'అల్లాహు నూరుస్సమావాతి వల్‌ అర్జ్‌' అంటూ అంటూ
                                ''జోలాలి....''
కలత చెందిన మనసుల్లో శాంతి సౌరభాలు జల్లాలి
కరడు గట్టిన గుండెల్లో కరుణ రసాలు నింపాలి
నువ్‌ కారుణ్యమూర్తి బాటన నడవాలి
'ఇన్నక లఅలా ఖులుఖిన్‌ అజీమ్‌' అంటూ అంటూ
                                ''జోలాలి....''
అవరోధాల్ని, అడ్డుగోడల్ని అవలీలగా దాటాలి
నువ్‌ ధర్మోన్నతి కోసం పాటు పడాలి
నువ్‌ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి
'యా జల్‌ జలాలి వల్‌ ఇక్రామ్‌' అంటూ అంటూ
                                  ''జోలాలి....''

No comments:

Post a Comment